తిరుపతి కపిలతీర్థంలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం అన్నాభిషేకం ఘనంగా జరిగింది.
ఉదయం సుప్రభాతంలో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 400 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు.
సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు భక్తులకు అన్నాభిషేక సర్వదర్శనం కల్పించారు. సర్వదర్శనానంతరం సాయంత్రం 6 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
అన్నాభిషేకంలో వినియోగించిన అన్నాన్ని సాంబారులో కలిపి భక్తులకు పంపిణీ చేశారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవంలో భక్తులు పాల్గొని అన్న లింగ దర్శనం చేసుకున్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మ సంచిత పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని భావిస్తారు.
పశుపక్ష్యాది సకల జీవరాశులు సుభిక్షంగా ఉండడానికి ఈ అన్నాభిషేకం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Leave a Reply