విస్తృత ఏర్పాట్లు చేస్తున్నటిటిడి
అధికారులతో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సమీక్ష
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 23 నుంచి డిసెంబరు 1వతేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నట్టు టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశం మందిరంలో గురువారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.
ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. నవంబరు 30న రథోత్సవం సందర్భంగా మహా రథాన్ని శుభ్రపరిచి, బ్రేక్‌లు, తదితర మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజులైన నవంబరు 27న గజవాహనం, నవంబరు 28న బంగారు రథం, గరుడవాహనం, డిసెంబరు 1న పంచమితీర్థం నాడు రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పంచమితీర్థం రోజున లక్షలాదిగా విచ్చేసే భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కరిణి చేరుకునేందుకు రూట్‌మ్యాప్, అందుకు అవసరమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని అన్నారు. బ్రహ్మోత్సవాలు జరుగు 9 రోజుల పాటు సందర్భంగా తిరుచానూరు పరిసర ప్రాంతాలలో మాంసం, మద్యం అమ్మకాలను నిషేధించాలని పంచాయతీ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పి డా.గజారావు భూపాల్, సిఇ శ్రీరామచంద్రారెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply