టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గల భజన మండళ్ల సభ్యులు ప్రజలలో భక్తి భావాని పెంపొందించేందుకు గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలని టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ పిలుపునిచ్చారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి 3వ సత్రం ప్రాంగణంలో ప్రాంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమంలో టిటిడి జెఈవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ దాససాహిత్య ప్రాజెక్టులోని భజన మండళ్ల సభ్యులు క్రమశిక్షణ, నైపుణ్యం కలిగి వున్నట్లు తెలిపారు. భజన మండళ్ల సభ్యులు తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసి, మంచి నడవడిక అలవర్చాలన్నారు. సనాతన హైందవ ధర్మం ప్రచారం చేయవలసిన బాధ్యత టిటిడిపై వుందన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు బలోపేతానికి, మెట్లోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు టిటిడి తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.
వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర
కాగా, సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 100 బృందాల్లో 2,000 మంది భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుంది. నవంబరు 7వ తేదీ గురువారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనంద తీర్థాచార్యులు, ఏఈవో శ్రీ రవిప్రకాష్‌రెడ్డి, భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
Leave a Reply