Photo Gallery : పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

శ్రీవారి బ్రహ్మూత్సవాల్లో జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ పుష్పయాగాన్ని చేసి స్వామి కటాక్షాన్ని అర్థిస్తారు. సోమవారం శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది.

తిరుమలలో పుష్పయాగం దృశ్యాలు

స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. 

పుష్పాధిదేవుడు ”పుల్లుడు” ఆవాహన :

పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి బంగారు తిరుచ్చిని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించడంతో శ్రీవారి పుష్పయాగం నేత్రపర్వంగా ముగిసింది.

అనంతరం టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధరించి నిర్వహిస్తున్నదన్నారు.

పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించిన‌ట్లు తెలిపారు. త‌మిళ‌నాడు నుండి 5 ట‌న్నులు, క‌ర్ణాట‌క నుండి 2 ట‌న్నులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి క‌లిపి ఒక ట‌న్ను పుష్పాలు, ప‌త్రాలను దాతలు విరాళంగా అందించార‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్జితసేవలైన విశేష పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*