తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం జరుగనున్న పుష్పయాగానికి ఆదివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఉదయం 6 గంటలకు ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.
రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారిని ఆలయం నుండి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
రాత్రి 9 నుండి 10 గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. అంకురార్పణం కారణంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, పేష్కార్ శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు, ఇతర అదికారులు పాల్గొన్నారు.
Leave a Reply